- ఎన్నికల హామీల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేయనున్నాం
- అర్హులందరికీ పెన్షన్లు అందచేస్తాం
- ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాం
రాజమహేంద్రవరం ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతోందని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక 29వ డివిజన్‌లో కొత్తపేట రైల్వే గేటు సమీపంలో 6, 21, 22, 23, 24, 25, 29, 30, 31, 32, 33 డివిజన్లకు సంబంధించి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఆయా డివిజన్లకు చెందిన ప్రజలు అశేషంగా హాజరై తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్జీలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు అందచేశారు. ముఖ్యంగా పెన్షన్లు, రేషన్ కార్డు, ప్రభుత్వ ఇంటి స్థలం తదితర సమస్యలు పరిష్కరించాలంటూ ప్రజలు అర్జీ పెట్టుకున్నారు. ప్రజలు విన్నవించిన సమస్యలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఓపిగ్గా వింటూ అర్జీలు స్వీకరించి ఆయా శాఖల అధికారులకు ప్రజల సమస్యలు పరిష్కరించాలంటూ సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే తమ కూటమి ప్రభుత్వం పని చేస్తోంది. దానిలో భాగంగానే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలెండర్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల్లో కొన్నింటిని ఇక్కడనే పరిష్కరించడం జరుగుతుందని, మరి కొన్నింటిని ఆయా శాఖలు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎక్కువమంది ప్రజలు పెన్షన్లు కొరకు దరఖాస్తులు చేసుకుంటున్నారన్నారు. గత ప్రభుత్వ నూతన పెన్షన్లు ఇవ్వకపోగా, ఉన్న పెన్షన్ దారులను అనర్హులుగా గుర్తించడంతో పాటు అర్హుల్కెన ఏ ఒక్కరికి పెన్షన్ అందించలేదన్నారు. అదేవిధంగా ప్రజలు రేషన్ కార్డు కొరకు కూడా దరఖాస్తులు చేసుకుంటున్నారని తెలిపారు. రేషన్ కార్డు లేకపోవడం వలన ప్రభుత్వం అందించే ఏ పథకానికి లబ్ధిదారులుగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అర్హత ఉండదన్నారు. గత ప్రభుత్వంలో అర్హుల్కెన వారికి కూడా రేషన్ కార్డు మంజూరు చేయక పోవడంతో అమ్మఒడి, హౌసింగ్ వంటి పథకాలకు అర్హుల్కెన లబ్ధిదారులకు అందలేదని చెప్పారు. ప్రజల వద్దకే పాలన దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకే వచ్చి ఆయా ప్రాంతాల్లోని సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు చేయడంలో ప్రజాభీష్టం మేరకే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టి ఆదిశగా ప్రభుత్వం ప్రజా దర్బార్ వేదిక ద్వారా అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజా దర్బారులో ఇచ్చిన అర్జీలతోపాటు ఈ కార్యక్రమానికి రానివారు ఎవరైనా ఉంటే వారి సమస్యలను వారి పరిధిలోని సచివాలయంలో అందజేయాలని వాటిని కూడా పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ముఖ్యంగా ప్రజలు పెన్షన్లు, రేషన్ కార్డ్, ఇళ్ల స్థలాల గురించి అడుగుతున్నారని వారి అర్హతను బట్టి అందించే క్రమంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు చేపడతానని ప్రజలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హామీ ఇచ్చారు.