ఏపీకి ముంచుకొస్తున్న మరో అల్పపీడనం ముప్పు

 


ప్రస్తుత ఐఎండి సమాచారం ప్రకారం...బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఆదివారం (అక్టోబర్ 20న)ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో అక్టోబరు 22, మంగళవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో  అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉంది, ఆ తర్వాత  అది వాయువ్య దిశగా కదిలి అక్టోబర్ 24 ,గురువారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.ఎటు వెళ్తుంది అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 

ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ మధ్యలోతీరం దాటొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డాక స్పష్టత వస్తుందని తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడన కారణంగా ఈ నెల 24వ తేదీ తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొంది.

ఇక ఆదివారం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అనకాపల్లి, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందని వెల్లడించింది.