వాంబే గృహాల్లోని సమస్యలను వెంటనే పరిష్కరించాలి అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశం


రాజమహేంద్రవరం  వాంబే గృహాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి స్థానికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఆదెమ్మ దిబ్బ వాంబే గృహాలను స్థానిక కూటమి నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీకవుతున్న శ్లాబ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. మంచినీటి సౌకర్యం మెరుగుపరచాలన్నారు. మురుగునీరు సక్రమంగా పారేందుకు స్థానికంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని ఆదేశించారు. మంచినీటి కోసం అక్కడ ఉన్న మోటార్లు సక్రమంగా పని చేసేలా చూడాలన్నారు. అలాగే ఆ ప్రాంతంలో చేపట్టిన సీసీ రోడ్లు, మేజర్ డ్రైనేజీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలు తమకు విన్నవించిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడం జరుగుతుందన్నారు. స్థానిక నాయకులు, అధికారులు తదితరులు ఆయన వెంట ఉన్నారు.