ఓ మహిళ బస్సులో బ్యాగ్ మర్చిపోయి.. దిగిపోయారు. ఆ బ్యాగులో విలువైన బంగారం, వెండి నగలు ఉన్నాయి. దీంతో ఆమె టెన్షన్ అంతా.. ఇంతా కాదు. ఇంతలో ఆమెకు పోలీసులు ఫోన్.. చేసి.. మీ బ్యాగ్ సేఫ్.. వచ్చి తీసుకెళ్లండి అని చెప్పడంతో.. ఆమెకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లు అయింది. ఫైనల్గా ఆ బ్యాగ్ ఆమెకు అందింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన తాలూకా వివరాలు తెలుసుకుందాం పదండి. నెల్లూరు జిల్లా ఇర్లపాడుకు చెందిన యానాదమ్మ అనే మహిళ... హైదరాబాద్ నుంచి మర్రిపాడు వెళ్లేందుకు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు ఎక్కారు. నంద్యాలకు చెందిన శైలజ అదే బస్సులో ట్రావెల్ చేశారు. అయితే శైలజ.. ఏదో ఆలోచనలో ఉండి.. బ్యాగును బస్సులోనే మర్చిపోయి తన స్టాప్లో దిగిపోయారు. కొద్దిసేపటి తర్వాత యానాదమ్మ తన పక్క సీట్లో బ్యాగ్ ఉండటాన్ని గమనించారు. దిగిన ప్రయాణికురాలిగా భావించి.. వెంటనే ఓపెన్ చేసి చూడగా.. అందులో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. దీంతో వెంటనే ఆమె ఆ బ్యాగును పోలీసులకు అప్పగించారు.
బ్యాగులో.. దాన్ని పోగొట్టుకున్న మహిళ వివరాలు ఉండటంతో.. వెంటనే పోలీసులు కాల్ చేసి సమాచారమిచ్చారు. ఆమె వెంటనే నంద్యాల నుంచి నెల్లూరు జిల్లా మర్రిపాడు రాగా.. పోలీసుల సమక్షంలో వెండి, బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ తిరిగి అప్పగించారు. ఆ బ్యాగ్లో 9 తులాల బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. బంగారం, వెండి ఉన్న బ్యాగ్ దొరికిన వెంటనే తెచ్చి.. పోలీసులకు ఇచ్చిన యానాదమ్మ మంచిమనసును పోలీసులు అభినంధించారు. తన బ్యాగ్ను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు శైలజ కూడా యానాదమ్మకు థ్యాంక్స్ చెప్పారు.