సీఎం జగన్ పై ప్రజాభిమానం చూస్తుంటే.. బాబు, పవన్ లకు బీపీ వస్తోంది: ఎంపీ మార్గాని భరత్ రామ్


 TV7 7తెలుగు రాజమహేంద్రవరం

వారికో భవిష్యత్తు లేదు..గ్యారంటీ లేదు..

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును ఎలా చూస్తారు..

వాళ్ళ జెండా, అజెండా, రాష్ట్రాన్ని దోచుకోవడమే..

  ఏపీలో‌ ఆ నేతలకు బీపీ తన్నుకు వస్తోందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఈ రాష్ట్ర ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు చూసి చంద్రబాబు, పవన్ లకు హై బీపీ మామూలుగా రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ టీడీపీ, జనసేన అధినేతలపై సెటైర్లు వేశారు. సోమవారం ఉదయం నగరంలోని వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీల అధినేతలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పాలన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. ఒకవైపు పేదల సంక్షేమం, మరోవైపు రాష్ట్ర అభివృద్ధి రెండూ సమాంతరంగా నిర్వహిస్తూ ప్రజాభిమానాన్ని సీఎం జగన్ చూరగొన్నారని అన్నారు. ఇప్పుడది చూసే..చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారని, బీపీ మామూలుగా లేదన్నారు. ఎలాగైనా జగనన్నను దింపాలన్నదే చంద్రబాబు, పవన్ ల జెండా, అజెండా, ఎల్లో మీడియా లక్ష్యంగా పనిచేస్తున్నాయని ఎంపీ భరత్ ఘాటుగా విమర్శించారు.

జగనన్న సురక్ష'..వారికో వరమే

నిరుపేదలలో ఇంకా అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారు ఉంటే..వారికీ సంక్షేమ ఫలాలు అందించే చక్కని బృహత్తర కార్యక్రమం 'జగనన్న సురక్ష' అని, గొప్ప వరమని ఎంపీ భరత్ తెలిపారు. మనసున్న నాయకుడు, పేదలను ఆదుకునే గొప్ప వ్యక్తిత్వం గల నేత సీఎం జగనన్న అని కొనియాడారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పార్టీ శ్రేణులు.. ప్రతీ వార్డులో సర్వే నిర్వహించి.. అర్హత ఉండి ఇంకా ఎవరికైనా సంక్షేమ ఫలాలు అందకుంటే, అందజేసేందుకే జగనన్న సురక్ష. కార్యక్రమమని ఎంపీ వివరించారు. ‌అలాగే ప్రస్తుతం సంక్షేమ పథక లబ్ధిదారులకు సక్రమంగా అందుతు‌న్నదీ లేనిదీ తెలుసుకుని, ఏమైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే  సీఎం జగనన్న లక్ష్యం అని ఎంపీ భరత్ వివరించారు. 

పవన్ కు నిర్థిష్టమైన ఆలోచన లేదు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఒక నిర్థిష్టమైన ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదని, ఆయన మాటల్లో పొంతన లేదని ఎంపీ భరత్ విమర్శించారు. రెండు సార్లు సీఎంను చెయ్యమంటున్నారు..ఒక చోట అసెంబ్లీకి పంపమని, మరో చోట సీఎంను చేయమని..ఇలా రకరకాలుగా మాట్లాడుతుంటే..ప్రజలకే కాదు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే అయోమయానికి గురవుతున్నారని ఎంపీ భరత్ ఎద్దేవా చేశారు. పవన్ అభిమానుల ముసుగులో అల్లరి మూక రెచ్చిపోతోందని..పవన్ జిల్లా పర్యటనలో ప్రజలు స్వయంగా చూసి..ఇలాంటి వారిని ప్రోత్సహించే నాయకులకు అధికారం ఎలా ఇస్తామని ప్రశ్నిస్తున్నారన్నారు. చంద్రబాబు, పవన్ ప్రశ్నిస్తామన్న వ్యక్తులను ప్రశ్నించడం లేదని..అందుకే వారిని ప్రజలే ప్రశ్నించే రోజులు సమీపిస్తున్నాయని అన్నారు.

అప్పుడు విమర్శించి..ఇప్పుడు సఖ్యత కోసం ఆరాటమా

టీడీపీ చంద్రబాబు 2019 ఎన్నికల వరకూ బీజేపీతో సఖ్యతగా, ఎన్డీఏ భాగస్వామిగా ఉండి.. ఎన్నికల ముందు విభేదించి బయటకొచ్చేసి..మళ్ళా బీజేపీ చంకలో దూరడానికి నానా పాట్లు పడుతున్నారన్నారు. ఒకవైపు జనసేన, మరో వైపు బీజేపీతో కలిసి..ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని తెగ హైరానా పడుతున్నారని ఎంపీ భరత్ తీవ్రంగా విమర్శించారు. 2014-19 వరకూ చక్కని అవకాశం ఇస్తే ఈ రాష్ట్రానికి చంద్రబాబు ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు.  మీకే ఒక భవిష్యత్తు లేదు..మీ కొడుకును మంగళగిరిలో గెలిపించుకోలేక పోయారు.. అటువంటిది ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమి చూడగలరని చంద్రబాబును ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్డీఏలో వైసీపీ భాగస్వామ్యం లేకపోయినా సఖ్యతగా ఉంటూ ఏపీకి రావాల్సిన నిధులు, పనులు చేయించుకోవడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారన్నారు. గతంలో ఎన్డీఏతో ఉన్న టీడీపీ ఈ రాష్ట్రం కోసం ఏమి చేసిందో చంద్రబాబు, పవన్ చెప్పగలరా అని ప్రశ్నించారు. ప్రస్తుత తరం, రేపటి తరం భవిష్యత్తు కోసం సీఎం జగన్ కష్టపడుతున్నారని, ప్రజలు కూడా గమనించే మనస్ఫూర్తిగా జగనన్నను ఆశీర్వదిస్తున్నారని  ఎంపీ భరత్ అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ నగర శాఖ అధ్యక్షుడు అడపా శ్రీహరి, సంకిస భవానీ ప్రియ, పోలు విజయలక్ష్మి, బర్రే కొండబాబు, మజ్జి అప్పారావు, ఎన్వీ శ్రీనివాస్, మార్గాని సురేష్, సీహెచ్ సత్యవాణి, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, కొమ్ము జాగ్లీరు, గుత్తుల భాస్కర్, రేగుళ్ళ నాని, తిరగాటి దుర్గ, నందివాడ సత్యనారాయణ, సుందర్సింగ్ సోడదాసి, గాడాల శ్రీను, వీ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.