TV77 తెలుగు రాజమండ్రి:
రాజమండ్రి, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాజమండ్రి నగరానికి త్వరలోనే సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) రానుంది. ఈ విషయమై గత సంవత్సరం డిసెంబరు 9వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ రాసిన లేఖకు కేంద్ర రైల్వేస్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు బుధవారం ఎంపీకి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎస్టీపీఐ పార్క్స్ ఏర్పాటుపై చర్చించడం, కేటాయించిన స్థలాన్ని పరిశీలించేందుకు త్వరలోనే సంబంధిత శాఖ డైరెక్టర్ వస్తారని ఎంపీకి ఆ లేఖలో కేంద్ర మంత్రి తెలిపారు. విశాఖపట్నం- విజయవాడల మధ్య దాదాపు వెయ్యేళ్ళకు పైగా చరిత్ర గల రాజమండ్రి నగరం జెట్ స్పీడ్ తో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ భరత్ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సమగ్రంగా వివరించారు. అనేక పారిశ్రామిక, బ్యాంకింగ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, వాణిజ్య సంస్థలు పుట్టుకొస్తున్నాయని అటువంటి నగరం ఐటీ హబ్ కావాలన్నదే నా ఆకాంక్ష అని ఎంపీ భరత్ కేంద్ర మంత్రికి తెలిపారు. ఎన్ హెచ్ 16 స్ట్రెచ్ పారిశ్రామిక, సాఫ్ట్‌వేర్, విద్యా రంగాలలో గొప్ప సామర్థ్యం కలిగి ఉందని అటువంటి రాజమండ్రి లో ఎస్టీపీఐ పార్కులను ఏర్పాటు చేసి ప్రోత్సహించడం ద్వారా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత సేవలు విస్తృత పరచడానికి అవకాశం ఉంటుందని ఎంపీ వివరించారు. ఇప్పటికే కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ దేశంలోని వివిధ ప్రదేశాలలో ఎస్టీపీఐ పార్కులను ఏర్పాటు చేసిన విషయాన్ని కేంద్ర మంత్రికి ఎంపీ భరత్ గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లా కేంద్రాలలో ఐటీ హబ్ ల ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తోందని ఎంపీ తెలిపారు. ఎస్టీపీఐ పార్క్ కోసం జిల్లా అధికార యంత్రాంగం అందుకు తగిన భూమిని రాజమండ్రి రూరల్ ధవళేశ్వరంలో రెండు ఎకరాలు గుర్తించిందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు ఎంపీ భరత్ వివరించారు. త్వరలోనే రాజమండ్రి రూరల్ లో ఎస్టీపీఐ పార్క్స్ ను కూడా చూడవచ్చు.