నకిలీల కు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు: జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి


 TV77 తెలుగు రాజమండ్రి :

ఏ మీడియాలో వీళ్ళు పని చేయరు

అధికారులను, ప్రజలను బెదిరిస్తారు

నకిలీల వల్ల బ్రష్టు పడుతున్న మీడియా

ఏ మీడియాలో కూడా పని చేయరు. గతంలో ఎప్పుడో పని చేసి ఉంటారు. కానీ. వీళ్ళ తీరు చూస్తే మాత్రం. నేషనల్ మీడియా ప్రతినిధుల హడావిడి చేసినంత హంగామా చేస్తారు. ఇటీవల కొన్ని వాట్సప్ గ్రూపుల్లో వీళ్ళు చేసే రచ్చ మామూలుగా లేదు. అడిగితే  ఘర్షణలే. మిడి మిడి జ్ఞానంతో నోటికొచ్చిన విషయాలను వాళ్ళ స్టైల్లో మసాలాలు నూరి మరి తప్పుడు కంటెంట్ లు పెడుతూ ఉంటారు. అది నిజమేమో అని మిగిలిన వారిలో కొందరు అపోహ పడుతుంటారు. జర్నలిజం. ఆ పదం చాలా పదునైనది.. విలువైంది. ఎంతటి అధికారి లేదా పాలకులను అయినా ప్రశ్నించే హక్కు ఆ పదానికి ఉంది. కొందరి తప్పుడు చేష్టలు వల్ల ఆ పదానికి నేడు విలువ లేకుండా పోయింది. అన్నీ ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతొంది అనే సామెత ఇలాంటి నకిలీలకు వర్తిస్తుంది. పెద్ద చిన్నా అనే తేడా లేకుండా క్షేత్రస్థాయిలో మీడియాలో పని చేసే రిపోర్టర్లు, జర్నలిస్టులకు చాలామందికి ఎప్పుడు ఎక్కడ ఎవర్ని ఏం అడగాలి అనే జ్ఞానం ఉంటుంది. దానికో పద్దతి ఉంటుంది అవగాహన ఉంటుంది. కానీ. కొంతమంది ఇటీవల పుట్ట గొడుగులు మాదిరిగా పుట్టుకొచ్చారు. అధికారులతో దురుసు తనం.. అడిగితే.ఆయ్.నేను ప్రెస్ అంటూ హుంకరింపు. దాంతో అవతలి అధికారికి నువ్వు ప్రెస్ అయితే ఏంటి.. అనే సమాధానం. అప్పటి నుంచి ఏ రిపోర్టర్ లేదా జర్నలిస్ట్ విషయం వచ్చినా అంతా ఇంతే అనే అపవాదును మూటగట్టుకోవాల్సిన దుస్థితి. కొంతమంది అధికారులు అయితే సార్.. నేను పలానా రిపోర్టర్ అని చెప్తే చాలు.. ఆ చెప్పు.. అనే అమర్యాద, తీరా ఆయన్ని ప్రశ్నిస్తే నీకు ఏం అనిపిస్తే అది రాసుకో పో.. అంటూ ఫైనల్ గా తెల్చేస్తున్నారు. తప్పు వాళ్ళది కాదు.. వాళ్ళ దృష్టిలో ఇంతలా మీడియాపై ఏవగింపు కలిగించిన నకిలీలదే.  కలెక్టర్, ఎస్పీ స్థాయిలో వాళ్ళని ఏం అడగాలి.. అనే విషయాల్లో కొందరికి అవగాహన లేదు. తమను ఆ అధికారి గుర్తు పెట్టుకోవాలని తపనలో ఏం మాట్లాడుతున్నారో కూడా స్పృహ ఉండటం లేదు. మీడియాలో పని చేసే వారు చాలా మంది అవతలి వ్యక్తి చెప్పే విషయాలను ఆసక్తిగా వినడం.. తర్వాత అర్థవంతమైన ప్రశ్నలు చక్కగా అడగడం చేస్తుంటారు. అంతేగానీ అడ్డగోలుగా ఉండే విధంగా అడగడం.. అర్రే.. ఈడికి కనీసం అవగాహన లేదు అనుకుంటా అనే విధంగా ఆ అధికారి దృష్టిలో పడుతూ కొందరు పరువు తీస్తున్నారు . అసలు మీడియాలో పని చేయరు. సోషల్ మీడియాలో మాత్రం పులులు. సరే.. మంచిగా వారి ప్రయాణం సాగితే పర్లేదు. అధికారులకు ఫోన్ చేసి.. నీ బతుకెంత అనేలా దురుసుగా ప్రవర్తించిన దాఖలాలు బోలెడు. కనీసం వీరు టెన్త్ పాస్ అవరు. కానీ సివిల్స్ లో ర్యాంక్ కొట్టి ఐఏఎస్, ఐపీఎస్ చదివి జిల్లాలకు వచ్చిన ఉన్నతాధికారులు, ఎంతో కష్టపడి చదివి నానా యాతనలు పడి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న అధికారులపై జులుం ప్రదర్శిస్తుంటారు. తలకిందులుగా తపస్సు చేసినా కానిస్టేబుల్ అవలేడు కానీ.. తన పరిధి దాటి డీ ఎస్పీ, సీఐ లపై కూడా తన దురుసుతనం చూపిస్తాడు.  ప్రశ్నించ వద్దు అనడం లేదు.. భారత పౌరుడిగా వ్యవస్థల్లో లోపాలను ప్రశ్నించ వచ్చు. ఎవరినైనా తప్పు చేస్తే నిలదీయాలి. కానీ నోటికొచ్చిన వాగుడుతో కాదు. హుందాతనం ఉండాలి. మీడియాలో పని చేయనప్పుడు సామాన్యుడిగా పోరాటం చేయాలి. అంతేగానీ ఇంకా మీడియా ప్రతినిధులమంటూ హుంకరించకూడదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మితే దెబ్బలు, పోలీస్ కేసులు తప్పవు. మీడియాలో లేని వ్యక్తులు కొందరు హద్దు దాటి ప్రవర్తిస్తున్న తీరు యావత్ మీడియా రంగంలో పని చేసే వారిపై ప్రభావం చూపిస్తుంది. 

నియంత్రణ చేస్తున్నాం.

చాలామంది మీడియాలో లేకుండా మాకు కాల్స్ చేయడం.. దురుసుగా మాట్లాడటం జరిగింది. చాలా వరకు వారిని కట్టడి చేశాం. కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో అలాంటి వాళ్ళు అవాస్తవాలని, కట్టు కథలను ట్రోల్ చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకున్నాం. ఇంకా కొందరు ఇలాంటి పనులకు పూనుకుని పోలీస్ వ్యవస్థపై బురద జల్లుతున్నారు. త్వరలో వారిపై చర్యలు తీసుకుంటాం. విజయ్ కుమార్ రాయుడు, బోమ్మూరు సర్కిల్ ఇన్స్ పెక్టర్.

ఊరుకునేది లేదు ప్రజలను, అధికారులపై మీడియా ముసుగులో ఎవరైనా జులుం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదు. మీడియాపై మాకు గౌరవం ఉంది. నిజాయితీగా పని చేస్ మీడియా ప్రతినిధులకు మేం అండగా ఉంటాం.. కానీ.. వారికున్న హక్కులతో పాటు బాధ్యతలను కూడా పాటించాలి. తామేదో అతీత శక్తులు అనే ధోరణిలో అధికారులను ఇబ్బంది పెడితే సహించం. పద్ధతి ప్రకారం నడుచుకుంటే మేము మంచిగానే సమాధానం ఇస్తాం.      సీ. హెచ్. సుధీర్ కుమార్ రెడ్డి, ఎస్పీ, తూర్పు గోదావరి జిల్లా.