TV77 తెలుగు రాజమహేంద్రవరం :
రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలి
- విశాఖ అద్భుత నగరం.. పాలనకు అనువైనది
ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందడానికి అన్ని హంగులూ, అవకాశాలూ ఉన్నాయని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. అయితే విభజన తరువాత ఆదుకోవాల్సిన అవసరం, బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందన్నారు. సోమవారం పాలనా వికేంద్రీకరణ- రాష్ట్రాభివృద్ధి అనే అంశంపై నగరంలోని మంజీరా హోటల్ కాన్ఫరెన్స్ హాలులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాస్ చంద్రబోస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తొలుత సమావేశాన్ని ఎంపీ భరత్ తన ఉపన్యాసంతో ప్రారంభించారు. రాష్ట్రంలో అతిపెద్ద కోస్టల్ ఉందని, మరి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తోందని సమయం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో మన రాష్ట్రంలోని ఎంపీలమంతా గళమెత్తుతూనే ఉన్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకువచ్చిందని, దాని ప్రకారం ఏ విధమైన అభివృద్ధీ జరగడం లేదన్నారు. దుగ్గిరాలపట్నం పోర్టు గురించి చాలా క్లియర్ గా చట్టంలో పేర్కొన్నా, కొన్ని సాంకేతిక కారణాలతో ముందుకు రావడం లేదు. దానిస్థానే రామయ్యపట్నం పోర్టు ప్రతిపాదనలు తీసుకువచ్చారన్నారు. ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఈ రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశం వేదికగా అడుగుతున్నట్టు ఎంపీ భరత్ చెప్పారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి.., అలానే పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అత్యంత శరవేగంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆశాభావాన్ని ఎంపీ వ్యక్తం చేశారు. విశాఖ అద్భుత నగరం.. మన రాష్ట్రంలో విశాఖపట్నం చాలా అద్భుతమైన నగరమని, పాలనాపరంగా ఎంతో సౌలభ్యంగా ఉంటుందని ఎంపీ భరత్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాలని కాదుకానీ..ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, గతంలో జరిగిన తప్పిదాలు, తొందరపాటు నిర్ణయాలు కారణంగా ముఖ్యమంత్రి చాలా దూరదృష్టితో విశాఖపట్నం పాలనా పరమైన రాజధానిగా చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఎందుకు విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలనుకున్నారో అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ఈ రాష్ట్ర ప్రజలకు వివరించారని, ప్రజలంతా స్వాగతించారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణానికి రెండు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని చెప్పారని, కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలో అంత పెద్ద మొత్తంలో సొమ్ములు ఎలా వస్తాయనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పలేకపోయారన్నారు. అన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం కూడా సాధ్యమయ్యే పనికాదని, ఈ విషయం చంద్రబాబుకూ తెలుసని, అయితే రాజధాని పేరుతో టీడీపీ ఉనికి కాపాడుకునేందుకు తీవ్రంగా యత్నించారన్నారు. చంద్రబాబు మాటలు, చేతకాని అనాలోచిత చర్యలను ప్రజలు పసిగట్టడం వల్లనే గత ఎన్నికలలో ఘోరంగా ఓడించారని చెప్పారు. జగన్ సమర్థతను గుర్తించి అత్యధిక సీట్లతో అధికారం అప్పగించారన్నారు. ఇప్పుడు సీఎం జగన్ ఆలోచన, లక్ష్యం ఒక్కటేనని..ఈ రాష్ట్రానికి అద్భుతమైన రాజధానిగా చాలా తక్కువ పెట్టుబడితో విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారన్నారు. చంద్రబాబు అమరావతికి ఖర్చు పెట్టాలనుకున్న రూ.20 లక్షల కోట్లలో కేవలం 20శాతం పెట్టుబడి పెడితే విశాఖ బొంబాయి నగరంలా అద్భుత నగరంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఇప్పటికే పరిపాలనా వికేంద్రీకరణ జరిగింది..ప్రజల వద్దకే పాలన వెళ్ళాలనే లక్ష్యంతో జగన్ అధికారంలోకి రాగానే పాలనా వికేంద్రీకరణకు నాంది పలికారని ఎంపీ భరత్ చెప్పారు. దానిలో భాగంగానే గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారన్నారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన సేవలు అందుతున్నాయన్నారు. విశాఖను పాలనాపరమైన రాజధాని చేయడం వల్ల మరింత అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుందని ఎంపీ భరత్ వివరించారు.