TV77 తెలుగు రాజమహేంద్రవరం:
ప్యాకేజీ స్టార్..ఏంటీ చచ్చు రాజకీయాలు?
- బీజేపీకి మద్దతా..టీడీపీకా..
- చంద్రబాబు, లోకేష్ లను కాపాడటానికే ట్వీట్ల బాబు మొగ్గలు
చంద్రబాబు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్..చచ్చు రాజకీయాలతో పబ్బం గడుపుకుంటున్నారని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్ర స్థాయిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. బుధవారం నగరంలోని వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్, చంద్రబాబులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ ఒకవైపు కేంద్రంలోని బీజేపీతో ఉంటారని, మరోవైపు బీజేపీకి బద్ధ శత్రువు అయిన టీడీపీకి కొమ్ము కాస్తుంటారని..ఇదేమి రాజకీయమని ప్రశ్నించారు. బీజేపీకి మద్దతా, టీడీపీకి మద్దతో చెప్పాలని, ముసుగులో గుద్దులాట ఎందుకని పవన్ ను ఉద్దేశించి ఎంపీ భరత్ సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి రైతుల ముసుగులో పాదయాత్ర డ్రామా ఆడిస్తుంటే, ఈ ప్యాకేజీ స్టార్ జనవాణి పేరుతో ఆ డ్రామా పాదయాత్రకు మద్దతుగా ప్రారంభించడం..ఎవరికి తెలియనదన్నారు. ప్రజలంత అమాయకులు కారని, అన్నిటినీ నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. నిజంగా ఆంధ్ర ప్రదేశ్ పై అభిమానం ఉంటే 2014 నుండి 2019 వరకూ చంద్రబాబు బీజేపీతో సఖ్యతగానే ఉన్నారు కదా..కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుని ఎందుకు అమరావతిని అభివృద్ధి చేయలేకపోయారని చంద్రబాబు, పవన్ లను ప్రశ్నించారు. సినిమా ఫీల్డ్ లో కంటే ఎక్కువ అందుతోంది కాబట్టే తాను టీడీపీకి వత్తాసు పలుకుతున్నట్టు చెబితే తప్పేముందని ఎంపీ భరత్ అన్నారు. కొంతమంది ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తారు.. మరికొంతమంది సంపాదించుకునేందుకు వస్తారు.. మీరు రెండవ కోవకు చెందిన వారేమోనని ప్రజలు భావిస్తున్నారని ఎంపీ ఎద్దేవా చేశారు. టిడీపీ వల్లే రాష్ట్ర విభజన..చంద్రబాబు కుతంత్ర రాజకీయాల వల్లనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయిందని ఎంపీ భరత్ పేర్కొన్నారు. వైఎస్సార్ మరణానంతరం 2014లో అప్పటి కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమించిందని, అప్పట్లో రాష్ట్రంలో అరాచకాలు ఏర్పడితే జగన్ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారని, దానికి మద్దతు ఇవ్వకుండా చంద్రబాబు గైర్హాజరయ్యారన్నారు. ఆనాడే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చి ఉంటే, కిరణ్ ప్రభుత్వం పడిపోయేదని..ఏపీ రెండుగా చీలేది కాదని ఎంపీ భరత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ను వీడి జగన్ బయటకు వచ్చిన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ తోపాటు వచ్చేస్తే..వారందరిచేతా రాజీనామాలు చేయించి, ఫ్యాన్ గుర్తుపై ఎన్నికల బరిలో టీడీపీ, కాంగ్రెస్ లతో తలపడిన దమ్మున్న నాయకుడు జగన్ అని ఎంపీ భరత్ అన్నారు. కాంగ్రెస్ తో చేతులు కలిపి చంద్రబాబు నీచాతి నీచమైన రాజకీయాలు చేశారన్నారు. అందుకే 2019 ఎన్నికలలో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలను వంచించడానికి, మభ్యపరచడానికి చంద్రబాబు చేస్తున్న అన్ని కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. జగన్ రాజకీయ విజ్ఞతతో కేంద్రంలోని బీజేపీతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్ట్స్ మంజూరు చేయించుకుంటున్నారని ఎంపీ చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పాటుపడుతున్నది వైసీపీ ప్రభుత్వమేనని, అందుకే గడప గడపకూ కార్యక్రమంలో ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నామని, రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తోందని ఎంపీ భరత్ చెప్పారు. ఈ సమావేశంలో నగర పార్టీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, ఎన్వీ శ్రీనివాసరావు, పాలిక శ్రీను తదితరులు ఉన్నారు.