TV77 తెలుగు రాజమహేంద్రవరం :
కార్పొరేట్ 'మాఫియా' చేతిలో క్షీణించిన విద్యా వ్యవస్థ
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాష్ట్రంలో ఏ ప్రభుత్వం విద్యా రంగంపై పెద్దగా దృష్టి సారించలేదని, కార్పొరేట్ మాఫియా చేతిలో విద్యా వ్యవస్థ పూర్తిగా క్షీణించిందని వైసీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం సమీపంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు-నేడు పథకం ద్వారా అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, రుడా ఛైర్మన్ షర్మిలారెడ్డి, రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ నాడు- నేడు మొదటి దశలో ప్రభుత్వ పాఠశాలలను వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని చెప్పారు. మలి విడతగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాడు-నేడు పథకం ద్వారా అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకూ చేయలేదని, విద్య విలువ తెలిసిన సీఎం జగన్ విద్యా సంస్థల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పటి వరకూ పాఠశాలలు ఏ విధంగానూ అభివృద్ధి చెందలేదన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఈ కళాశాల అప్పట్లో ఎలా ఉందో.ఇప్పుడూ అలానే ఉందన్నారు. కనీసం విద్యార్థినులకు టాయిలెట్ సదుపాయం లేదన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకునే సీఎం జగన్ జూనియర్ కళాశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇప్పటి వరకూ కార్పొరేట్ మాఫియా చేతిలో విద్యా వ్యవస్థ ఉండటం వల్ల ప్రభుత్వ విద్యా సంస్థలపై ఏ ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ వహించలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు తగ్గట్టు తీర్చిదిద్ది, నాణ్యమైన విద్యను అందివ్వాలన్నది సీఎం జగన్ లక్ష్యమన్నారు. విద్యార్థులు చదువులో రాణించి వివిధ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటే ఉన్న ఊరుకు, కన్న తల్లిదండ్రులకు ఎంతో గర్వకారణమన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆంగ్ల బోధన అవసరాన్ని, ప్రాధాన్యతను గుర్తించే సీఎం జగన్ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఆంగ్ల భాషా బోధనకు శ్రీకారం చుట్టారని, మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ విద్యా సంవత్సరం ఆరంభంలో రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలను మహిళా కళాశాలగా మార్పు చేశారని, అయితే ప్రజలనుండి వచ్చిన విజ్ఞప్తి పై మళ్ళీ కోఎడ్యుకేషన్ గా కొనసాగేటట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను జూనియర్ కళాశాలలో నాడు-నేడు పనులకు అనుమతులు వచ్చినట్టు తెలిపారు. రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.1.47కోట్లతో, ధవలేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ. 79 లక్షలతో, మురమండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ. 68 లక్షలతో నాడు-నేడు పథకం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్టు కలెక్టర్ వివరించారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.