డిజిటల్ విలేజ్ గా గోకవరం.లోక్ సభలో ఎమ్.పి.భరత్ ప్రశ్న


 TV77తెలుగు ఢిల్లీ :

దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఒక పల్లె చొప్పున 700 గ్రామాలను ఎంపిక చేసి డిజిటల్ విలేజ్ పైలట్ ప్రాజెక్ట్ ను అమలు చేస్తున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ  చేత సహాయమంత్రి  రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. లోక్ సభలో బుధవారం రాజమండ్రి ఎమ్.పి. మార్గాని భరత్, మరో ముగ్గురు ఉత్తరాది ఎమ్.పి. లు కలిసి సంధించిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గ్రామీణ ప్రజానీకానికి ఆధునిక డిజిటల్ సేవలు అందించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న గ్రామాల్లో కంప్యూటర్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి డిజిటల్ సేవా పోర్టల్ ద్వారా పలు సర్వీసులు అందిస్తారు. విద్యా సర్వీసుల్లో భాగంగా బేసిక్ కంప్యూటర్ కోర్సులు, టాలీ  వంటివి యువతకు నేర్పిస్తారు. మనుషులతో పాటు పశు సంపదకు కూడా టెలీ హెల్త్ కన్సల్టేషన్ సర్వీసును ప్రవేశ పెడతారు. ప్రతి గ్రామంలో ఎనిమిదికి తక్కువ కాకుండా సోలార్ వీధి లైట్లను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేస్తారు. మోటార్ వాహనాల టెక్నీషియన్, గృహోపకరణాల మరమ్మత్తులు, ఎలక్ట్రికల్ రిపైర్లు వంటి విభాగాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు. సర్కారీ పోటీ పరీక్షల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, వివిధ వృత్తి విద్యా కోర్సుల రిజిస్ట్రేషన్, పాన్ కార్డ్ సర్వీసులు, కొత్త ఆధార్ కార్డుల నమోదు - మార్పు చేర్పులు తరహా ఆన్ లైన్ సర్వీసులు అందుబాటులోకి తెస్తారు. అంతేకాకుండా మొబైల్, డి.టి.హెచ్. రీచార్జ్ లు, రైలు - విమానాల టికెట్ బుకింగ్ లు మొదలైన సర్వీసులు గ్రామాల్లోకి అందుబాటులోకి వస్తాయి. ఈ డిజిటల్ విలేజ్ పైలట్ ప్రాజెక్ట్ కోసం  గ్రామానికి సుమారు పదిలక్షల చొప్పున కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పూర్వపు తూర్పు గోదావరి జిల్లా ప్రాతిపదికన గోకవరం గ్రామాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద పైన పేర్కొన్న కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.