రాహుల్ గాంధీని నాలుగో రోజు ప్రశ్నిస్తున్న ఈడి..సోదరుడి వెంట ప్రియాంకా


 TV77తెలుగు  

నేషనల్‌ హెరాల్డ్‌ కేసు విచారణలో భాగంగా రాహుల్‌ గాందీ ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. ఈనెల 13 నుంచి వరుసగా మూడు రోజుల పాటు రాహుల్‌ను విచారించిన ఈడీ తాజాగా నాలుగో రోజు విచారణను ప్రారంభించింది. నిజానికి రాహుల్‌ ఈ నెల 17న విచారాణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తల్లి సోనియా ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మూడు రోజుల పాటు తనకు సమయం కావాలని రాహుల్‌ కోరారు. దీంతో రాహుల్‌ అభ్యర్థనను పరిగణలోని తీసుకున్న ఈడీ అంగీకారం తెలిపింది. దీంతో రాహుల్‌ సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. రాహుల్‌ను ఈడీ అధికారులు ఇప్పటి వరకు 30 గంటల పాటు విచారించారు. ఇదిలా ఉంటే తాజాగా సోమవారం విచారణకు హాజరయ్యే సమయంలో రాహుల్‌తో పాటు సోదరి ప్రియాంక గాంధీ ఈడీ ఆఫీస్‌కు వచ్చారు. ఈడీ కార్యాలయం దగ్గర చాలా సేపు కారులో వేచి ఉన్నారు ప్రియాంక. అనంతరం అక్కడే రాహుల్ గాంధీకి మద్ధతుగా వచ్చిన పార్టీ కార్యకర్తను స్వయంగా తన కారులో ఎక్కించుకొని జంతర్ మంతర్ దగ్గర జరుగుతోన్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రియాంక వెళ్లిపోయారు. ఇక ఓ వైపు ఈడీ విచారణ కొనసాగుతుంటే కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్‌మంతర్‌ దగ్గర సత్యాగ్ర దీక్ష చేస్తున్నారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. అలాగే గాంధీ కుటుంబంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ సోమవారం సాయంత్రం రాష్ట్రపతి కోవింద్‌కు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు సిద్ధమవుతున్నారు.