TV77తెలుగు హైదరాబాద్:
ప్రధాని నరేంద్రమోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు.గాంధీభవన్‌లో జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర సమస్యలు అడిగే బాధ్యత సీఎంకు లేదా అని ప్రశ్నించారు. ప్రధానిని ప్రశ్నించే అవకాశం ఉన్నప్పటికీ కేసీఆర్ ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రజల ముందే ప్రధానిని నిలదీశారన్నారు. మరి సీఎం కేసీఆర్ ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ రాష్ట్రానికి రావడం.. సీఎం కేసీఆర్ వెళ్ళడం.. ఇది పూర్తి అవగాహనతోనే జరిగిందని ఆరోపించారు.
''కేసీఆర్, మోదీ మధ్య రాజకీయంగా అవగాహన ఉంది. భాజపా, తెరాస పరస్పర విమర్శలు ఒక నాటకం. ప్రజా సమస్యల మీద ప్రధాని మోదీ ఎందుకు స్పందించలేదు? ఒక్కో పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీపై ప్రధాని ఎందుకు మాట్లాడలేదు?భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్యోగాల భర్తీ పై మోదీని ఎందుకు అడగలేదు? మత విద్వేషాలు రెచ్చగొట్టేలా బండి సంజయ్ మాట్లాడటం సరికాదు. అందరూ బాగుండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్. భాజపాకు వ్యతిరేకంగా కేసీఆర్ తిరగడం లేదు. రాజకీయ విమర్శలు మాని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయాలి'' అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.