రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా : ఎంపీ మార్గాని భరత్


 TV77తెలుగు రాజమహేంద్రవరం :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజనలో అన్యాయం జరిగిందని సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజ్యససభలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై లేదా అని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అన్ని హామీలపై చర్చ జరిగేలా కేంద్ర ప్రభుత్వం త్రీ మెన్ కమిటీ నోటిఫికేషన్ ను సవరించాలని స్పష్టం చేసారు. రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు వల్లనే కేంద్ర హోమ్ శాఖ నోటిఫికేషన్ నుంచి ప్రత్యేక హోదా అంశాన్ని తొలగించిందని, దాన్ని వెంటనే సరిచేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు కేసుకు భయపడి రాష్ట్రాన్ని, రాజధానిని వదిలేసి ప్రత్యేక ప్యాకేజీకి ఆశపడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. నెల రోజులుగా పార్లమెంట్ సెషన్లో పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రశ్నలు సంధించినట్టు తెలిపారు. టీడీపీ నాయకులు అధికారంలో ఉన్నంతసేపు మహిళలను అన్ని విధాలుగా మోసం చేసి ఇప్పుడు వైఎస్ఆర్సిపి మహిళలకు రాజ్యాధికారం ఇస్తుంటే నారీ సంకల్ప దీక్షలంటూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అది నారా వారి మోళీ దీక్షని దుయ్యబట్టారు. రాష్ట్రంలో 45 లక్ష మహిళలకు అమ్మఓడి, 85 లక్షల మహిళలకు ద్వాక్రా సంఘాలకు ఆసరా ద్వారా వేల కోట్లు, 40 లక్షల మంది మహిళలకు చేయూత నిచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదన్నారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లను తీసుకుని వచ్చినందుకు నారీ సంకల్ప దీక్షలు చేస్తున్నారా అని నిలదీసారు. విజయవాడలో జరిగిన దుర్ఘటనను ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని అటువంటి ఘటనకు పాల్పడిన నాయకులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేయాల్సి పోయి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు మొక్కుబడి దీక్షలు చేస్తున్నారని విమర్శించారు. దీక్ష మధ్యలోనే కొందరు నాయకులు లేచి భోజనాలకు వెళ్లిపోయారని ఇదేనా వారికి మహిళలపై ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయాంలో లక్షలాది బెల్టు షాపులు ఉండేవని, వాటి ద్వారా కష్టబడి సంపాదించిన సొమ్మంతా నష్టపోయి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయని నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. టీడీపీ నాయకులు అబద్దపు మాటలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేసారు. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం అవకాశాలు కల్పిస్తూ అగ్రతాంబూలం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి మహిళలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించారన్నారు. ఏ ముఖం పెట్టుకుని దీక్షలు చేస్తున్నారో తెలపాలని, మహిళ సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే సహకరించకుండా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి టిడిపి సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు జి.వి. ఏల్ నరసింహారావు రాష్ట్రానికి హోమ్ శాఖ నుండి వచ్చిన 9 అంశాల నోటిఫికేషన్ లో సవరించి 5 అంశాలకు తగ్గించాలని మీరు చెప్పలేదా అని ప్రశ్నించారు. పోలవరానికి ఇప్పటివరకు రాష్ట్రమే నిర్మిస్తుంది. ఒక జాతీయ ప్రాజెక్ట్ను రాష్ట్రం నిర్మిస్తుంటే దానికి సాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. సవరించిన అంచనాల ప్రకారం 55 వేల కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన అంశాలు కోసం ఎంపీలందరూ పార్లమెంట్, రాజ్యసభల్లో పోరాడుతున్నారని, దీనిపై కూడా తెలుగుదేశం ఎంపీలు తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు. సమావేశంలో రూరల్ వైసిపి కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, హితకారిణి సమాజం చైర్మన్ కాశి మునికుమారి, అఖిల గాండ్ల/తెలికుల కార్పొరేషన్ చైర్పర్సన్ సంకిన భవానీప్రియ, ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నగర వైస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు నల్లమిల్లి కాంతమ్మ, వైసిపి మహిళా నాయకులు కొత్త విజయరాజ్యలక్ష్మి, డాక్టర్. అనసూరి పద్మలత, హితకారిని ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ గుడాల ఆదిలక్ష్మి, దుంగ మంగ,హితకారిని ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ సరితా రాణి, సూర్యకాంతం, అనంతలక్ష్మి, సత్య, దుర్గ తదితరులు పాల్గొన్నారు.