TV77తెలుగు విశాఖపట్నం :
బంగాళాఖాతం నుంచి కోస్తాపైకి తేమ గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు కోస్తా రాయలసీమలో పగటి ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరగడంతో వాతావరణం వేడెక్కింది. దీంతో వాతావరణ అనిశ్చితితో అక్కడక్కడా మేఘాలు ఆవరించాయి. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ వెదర్ మ్యాన్ కూడా వర్షాలు, చలి వాతావరణంపై అలర్ట్ చేశారు. సోమవారం విశాఖ, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటూ మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడతాయని చెబుతున్నారు. రాయలసీమలోని చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని జిల్లాల్లో వాతావరణం మారిపోయింది.. విపరీతంగా మంచు కరుస్తోందంటున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం బాగా చల్లగా ఉంటుంది అంటున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మంచు కురుస్తోంది. అంతేకాదు సంక్రాంతి సమయంలో అకాల వర్షాలు కురిశాయి. రెండు, మూడు రోజుల పాటూ ఓ మోస్తరు నుంచి చిరు జల్లులు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ వానలకు అవకాశం ఉందని చెప్పడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. మిర్చితో పాటూ మరికొన్ని పంటలు పొలాల్లోనే ఉన్నాయి.