TV77తెలుగు కాణిపాకం(యాదమరి):
చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆస్థాన మండపంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు "మన సంస్కృతి కళా సంస్థ" తిరుపతి వారి ఆధ్వర్యంలో 108 భక్తి గీతాలు పండుగ కార్యక్రమం వైభవంగా జరిగింది. పై కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మండలి కమిటీ చైర్మన్ జె.మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు పాశ్చాత్య ప్రభావంతో మన సంస్కృతికి మన సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయని కాబట్టి మన భాష సంస్కృతి సంప్రదాయాలను రక్షించుకునే బాధ్యత మన అందరిపైన ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వాటి పరి రక్షణకు ఎంతో తోడ్పడతాయని అన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం ఆధ్యాత్మిక స్థలమైన కాణిపాకంలో జరిపిన కార్యక్రమ నిర్వాహకులు కలకట రెడ్డప్పను, అవిలాల శ్రీధర్ ను అభినందించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ మన భాష కళలు ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను బ్రతికించాలంటే ప్రభుత్వం కళాకారులను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వం సినిమా రంగాన్ని ప్రోత్సహించినట్లే సంప్రదాయ మైనటువంటి ప్రాచీన కళా సాంస్కృతిక ప్రాచీన కళలను ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమానంతరం శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ మండలి చైర్మన్ ఏ.మోహన్ రెడ్డి చేతుల మీదుగా "మన సంస్కృతి కళా సంస్థ" ప్రధాన కార్యదర్శి కలకట రెడ్డప్ప కు దుష్శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. పై కార్యక్రమంలో కాణిపాకం ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.వెంకటేష్, మదనపల్లి ఉప విద్యాధికారి జి.కృష్ణప్ప, ప్రముఖ కవయిత్రి మరియు విశ్రాంత ఉపాధ్యాయులు ఎం.ఆర్ అరుణకుమారి, కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, సామాజిక సేవకులు మరియు పాత్రికేయులు జానం గంగిరెడ్డి, వై ఎస్ ఆర్ సి పి మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి, కవి గాయకులు ఆర్.సహదేవ నాయుడు, బండి ఈశ్వర్ ,విశ్రాంత ఉపాధ్యాయులు హరినాయుడు, ప్రాథమిక పాఠశాల హెచ్.ఎం హరినాథ్, జయచంద్రారెడ్డి, హరిదాసు కుప్పుస్వామి తదితరులు పాల్గొన్నారు.