ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి మీడియా సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు వెంటపల్లి జాన్మార్క్ పిలుపు


 

TV77తెలుగు  రాజమహేంద్రవరం :

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు, దళితరత్న వెంటపల్లి జాన్మార్క్ వెల్లడించారు. గత 20 సంవత్సరాల నుంచి షెడ్యూల్ కులాలను విభజించే కుట్ర జరుగుతోందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసపూరితంగా ఎస్సీ వర్గీకరణ ఎ, బి, సి రూపంగా అమలు చేసారని దీని వల్ల వేలాది ఉద్యోగాలు, ప్రమోషన్లు, విద్యార్థుల సీట్లు అన్ని రంగాల్లో కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేసారు. ది రాజమండ్రి ప్రెస్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఛలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి అధ్యక్ష, కార్యదర్శులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముచ్చి సురేష్ (నాని), పాలపర్తి ప్రవీణ్ కు నియమాక పత్రాలు అందచేసి పూలమాలలతో అభినందించారు. ఆయన మాట్లాడుతూ జుర్గే సంతోష్తో పాటు నలుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం దళితులను విభజించిన ఎస్సీ వర్గీకరణ బిల్లుచెల్లదని తీర్పు ఇచ్చిందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వర్గీకరణకు తాము అనుకూలం అంటూ వ్యాఖ్యానిస్తున్నారని దీన్ని నిరసిస్తూ ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టామని సుమారు 4 వేల మందితో జంతర్ మంతర్ వద్ద వర్గీకరణను నిరసిస్తూ నిరసన ధర్నా చేపడుతున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను విరమించుకోవడంతో పాటు ప్రైవేటు రంగాల్లోనూ రిజర్వేషన్ కల్పించాలని, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని, బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, ఏజెన్సీలో నివసిస్తున్న దళితులకు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఎస్టీల ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేసారు. తెలుగు రాష్ట్రాల్లో అంబేద్కర్ వాదులు ప్రజాందోళన ద్వారా ప్రతిఘటించేందుకు ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్కుమార్ నాయకత్వంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కమిటీలు వేస్తున్నామన్నారు.