TV77తెలుగు మండపేట :
మండపేట మండలం తాపేశ్వరం వల్లూరి కాశీ విశ్వనాథం ప్రాథమిక పరపతి సంఘంపై పలు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గతంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని కొందరు ఫిర్యాదు చేయగా విచారణ అధికారులు సైతం సొసైటీకి వత్తాసు పలుకుతూ విచారణ తప్పు పట్టించారని ఫిర్యాదిదారులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో తిరిగి విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. దీంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు మండలంలోని తాపేశ్వరం సొసైటీ వద్ద తిరిగి విచారణ చేపట్టనున్నారు. గతంలో విచారణ చేపట్టేందుకు వచ్చిన అధికారులే తిరిగి ఇప్పుడు కూడా వస్తున్నారని తమకు ఎలాంటి భయం లేదని తాపేశ్వరం సొసైటీ సిబ్బంది పేర్కొనడం గమనార్హం. దీనిపై ఫిర్యాదుదారులు మీడియాను ఆశ్రయించారు. నిష్పక్షపాతంగా ఆరోపణలపై విచారణ నిర్వహించాలని బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. దీనిపై అర్తమూరుకు చెందిన తమలపూడి సతీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తాపేశ్వరం సొసైటీలో అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. వీటికి సంబంధించి ఇటీవల కర్రి లక్ష్మణ రెడ్డిని సహకార సంఘంలో ఉద్యోగంలోకి తీసుకున్నారన్నారు. అతన్ని శిక్షణకు పంపి సహకార సంఘంలోకి చేర్చుకున్న అనంతరం కర్రి లక్ష్మణ రెడ్డిపై అన్యాయంగా విచారణ వేయించారని ఆరోపించారు. ఆయన ఉంటే తమ అవినీతి బట్టబయలు అవుతుందనే ఉద్దేశ్యం తో అతని ని ఉద్యోగం నుండి తప్పించారని ఆరోపించారు. దీనిపై మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందించి సహకార సంఘం డి సి ఓ, డి ఆర్ లతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. సహకార సంఘంలో డీఆర్ నాగభూషణంను సొసైటీపై విచారణ నిర్వహించాలని ఆదేశించారన్నారు. ఆ విచారణకు విచ్చేసిన అధికారులు తమతో సొసైటీలో చాలా అవకతవకలు ఉన్నాయని పేర్కొన్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి డీఆర్ కు నివేదిక కూడా ఇచ్చారన్నారు. అనంతరం తాపేశ్వరం పీఏసి లో కార్యదర్శి, సీఈవో గోవిందు పై చర్యలు తీసుకోవాలని త్రిసభ్య కమిటీకి ఆదేశించారు. ఈ ఆదేశాలను తుంగలోకి తొక్కి ఆ కార్యదర్శి, సీఈవో గీసాల గోవిందును త్రిసభ్య కమిటీ సభ్యులు సహకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై తాము తిరిగి ఫిర్యాదు చేశామని తెలిపారు. సొసైటీలో ఎరువుల అంశంలోనూ, జీతాల పెంపు, ధాన్యం కొనుగోలు తదితర అంశాల్లో తీవ్ర అవినీతి జరిగినట్లు ఆరోపించారు. రుణాల అంశంలో కూడా అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయని ఈ అక్రమాలపై విచారణ నిర్వహించి న్యాయం చేయాలని ఆయన మీడియాకు తెలిపారు.