TV77తెలుగు రాజమహేంద్రవరం :
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీసీ సేన నాయకులు
జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని బీసీ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆద్వర్యంలో బీసీల సమస్యలు పరిష్కరించాలని, బీసీల జనగణన జరపాలని కోరుతూ ఆందోళన నిర్వహించారు. ఈసందర్భంగా బీసీ సేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శరత్ కుమార్ మాట్లాడుతూ జనగణనలో బీసీ కులాలను లెక్కించాలని దేశవ్యాప్తంగా బీసీలు ఉద్యమిస్తుంటే కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ఈవిషయమై కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఈనెల 13, 14, 15 తేదీల్లో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆందోళనల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి బీసీలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో బీసీ జనగణనపై చర్చ జరిగేలా అన్ని రాజకీయ పార్టీల ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమై 11రోజులు కావస్తున్నా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీ గణనపై మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు. బీసీ గణన చేపట్టాలని అసెంబ్లీ తీర్మానం చేసిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కూడా పార్లమెంటులో ఎందుకు మాట్లాడటం లేదో ప్రజలకు చెప్పాలని కోరారు. ఇదే బీసీ వ్యతిరేక విధానాలతో వవహరిస్తే బీసీలంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో వారికి రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ఎం. నరేష్, కుమార్ యాదవ్, చంటి యాదవ్, సతీష్ గౌడ్, సురేష్, పరశురాం, వైఎస్ఆర్సిపి యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ నమ్మి నరేష్ తదితరులు పాల్గొన్నారు.