జవాద్‌ తుఫాన్‌ ముప్పు తప్పింది


 TV77తెలుగు విశాఖపట్నం :

ఉత్తరాంధ్ర జిల్లాలకు జవాద్‌ తుఫాన్‌ ముప్పు తప్పింది. తుఫాన్‌ బలహీనపడి శనివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. తాజా పరిస్థితుల ప్రకారం తుపాను ఒడిషావైపు మళ్లడంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ ముప్పు తప్పినట్టేనని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. జవాద్‌ తుఫాన్‌ శుక్రవారం రాత్రి వరకు వడివడిగా తీరం దిశగా పయనించింది. విశాఖపట్నానికి 180 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయంగా, గోపాల్‌పూర్‌కు 260 కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఈ క్రమంలోనే బలపడి తీవ్ర తుఫాన్‌గా మారాల్సి ఉన్నా వాతావరణం అనుకూలించకపోవడంతో పాటు దిశ మార్చుకునే క్రమంలో బాగా నెమ్మదించింది. శనివారం తెల్లవారుజాము నుంచి బాగా నెమ్మదించి గంటకు 6కిలోమీటర్ల వేగంతో పయనించింది... ఉదయం కొన్ని గంటల పాటు స్థిరంగా ఉండిపోయింది. ఈ సమయంలో తుఫాన్‌ పరిసరాలకు ఏడెనిమిది కిలోమీటర్లపైన గాలులు పలు దిశల్లో పయనించడం, ఉత్తరాది నుంచి చలిగాలులతో బంగాళాఖాతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు తగ్గాయి.