TV77తెలుగు నరసరావుపేట :
అనధికార చిట్టీల వ్యాపారం నిర్వహించి స్ధానికుల నుంచి సుమారు ఏడుకోట్ల రుపాయలు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన నిడమానురు భీమేశ్వరరావు భార్య సుబ్బాయమ్మ దంపతులు, వారి బంధువు ఎన్.శివప్రసాద్ లు చిట్టీల పేరుతో ప్రజల వద్ద నుంచి ఏడు కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. బాధితుల్లో ఫిరంగిపురంతో పాటు గుంటూరు నరసరావుపేట, వినుకొండ, పేరేచర్ల వాసులు ఉన్నారని తెలుస్తోంది. సుమారు 50 మంది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 406 (నేరపూరిత విశ్వాస భంగం) మరియు ఆంధ్రప్రదేశ్ చిట్ ఫండ్స్ చట్టం, 1971 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.