TV77తెలుగు సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం బ్రహ్మణపల్లిలో గత నెల 29న తండ్రి హత్య కేసులో ఇద్దరు కొడుకులను అరెస్టు చేసినట్టు సీఐ శ్రీనివాస్ తెలిపారు. శనివారం జోగిపేటలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తండ్రి పెద్ద గొల్ల పాపయ్యను చంపిన కేసులో పెద్ద గొల్ల కృష్ణ, పెద్ద గొల్ల నరేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. గ్రామంలో మృతుడి పేరు మీద 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, నలుగురు కుమారులు భూమి కోసం తండ్రితో గొడవకు దిగారు. అందరికీ సమానంగా భూమిని పంచాలని గొడవలు జరగగా, పంచాయితీ పెట్టగా అట్టి పంచాయతీలో పెద్ద కుమారుడు పెద్ద గొల్ల విట్టల్‌కు అర్థ ఎకరం భూమి ఎక్కువగా ఇవ్వాలి అని మృతుడు పట్టుబట్టాడు. రెండవ, మూడవ కుమారులు నరేష్, కృష్ణలు అందుకు అంగీకరించలేదు. ఈ విషయంలో తండ్రిపై కక్ష పెంచుకున్న ఇద్దరు కుమారులు పథకం ప్రకారం గత నెల 29న తండ్రితో గొడవ పడి కొట్టి చంపారు.పెద్ద కుమారుడు పెద్ద గొల్ల విట్టల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టు ఆయన తెలిపారు. ఈనెల 8వ తేదీన సాయంత్రం 5 గంటలకు నేరస్థులను అరెస్టు చేసి జడ్జి ముందు హాజరు పరిచి రిమాండ్‌కు పంపించినట్టు జోగిపేట ఎస్సై వెంకటేష్ చెప్పారు.