మోరంపూడి ప్లై ఓవర్పై గ్రాఫిక్స్ వద్దు... ప్రజలకు వాస్తవాలు చెప్పండి
ప్రజా ప్రతినిధులకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు సూచన
TV77తెలుగు రాజమహేంద్రవరం సిటీ:
నిత్యం ప్రమాద ఘంటికలు మోగుతున్న మోరంపూడి జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణకు తక్షణం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసులకు సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ వారం రోజుల్లో మోరంపూడి జంక్షన్ వద్ద జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో వాహన చోదకులు మృత్యువాత పడడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఆ ప్రాంతాన్ని యాక్సిడెంట్ ప్రోన్ జోన్ గా ప్రకటించి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు, వాహన చోదకులు జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు ఇస్తూ తగిన సింబల్స్ ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. మోరంపూడి జంక్షన్ వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ వారికి సూచించారు. ఆ జంక్షన్ మీదుగా రాకపోకలు చేసే వారిని హెచ్చరిస్తూ నెమ్మదిగా రావాలని జంక్షన్కు అటు.. ఇటూ సుమారు అర కిలో మీటరు ముందు నుంచే వాహన చోదకులకు సూచనలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే మోరంపూడి జంక్షన్కు సంబంధించి అక్కడ ఫై ఓవర్ నిర్మాణం అప్పుడే జరగదన్న వాస్తవాలను ప్రజలకు చెబితే మంచిదని, లేనిపోని గ్రాఫిక్స్ చూపించి ఆ ప్రాంతంలో ప్రజలను, వాహన చోదకులను అయోమయానికి గురి చేయోద్దని సూచించారు. ప్లై ఓవర్ నిర్మాణం వాస్తవ పరిస్థితిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అక్కడ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి తగిన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు కాపాడాలన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియ చేయాలే తప్ప లేనిపోని అపోహలు కలిగేలా వాస్తవ విరుద్ధ ప్రకటనలు చేయవద్దన్నారు. ఫ్లై ఓవర్ నిర్మాణం ఆలస్యం అవుతుందన్న విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా తెలియచేయాలే కాని గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టోదని ఆదిరెడ్డి వాసు సూచించారు.