జననేత వర్ధంతికి రక్తదానం చేసిన రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

TV77తెలుగు రాజమహేంద్రవరం : తనదైన పాలనతో తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నేత వై.ఎస్ రాజశేఖరరెడ్డి అని రాజనగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా అన్నారు.గురువారం నాడు, రాజమహేంద్రవరం పేపర్ మీల్ ఎదురుగా గల కృష్ణ సాయి కళ్యాణమండపం నందు స్వర్గీయ డాక్టర్ వై.యస్ రాజశేఖరరెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకొని టి. కె. విశ్వేశ్వర రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా వైయస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో రక్తదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్‌ది చెరగని స్థానం అని, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడి వాటి పరిష్కారానికి విశేషంగా కృషి చేసే వారన్నారు. వై.యస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బడుగు,బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి,వారి మోములలో చిరునవ్వు చిందించిన మహోన్నత వ్యక్తి వై.యస్.ఆర్ అని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు ఆరోగ్య శ్రీ పధకం ద్వారా ఎందరో నిరుపేదలకు పునర్జన్మ ప్రసాదించి వారి జీవితాలలో వెలుగు నింపిన వ్యక్తి వై.యస్.ఆర్ అని,పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు ప్రవేశపెట్టి వారి ఉజ్వల భవిష్యత్తు తీర్చిదిద్దిన మహనీయుడు అని ఆయన కొనియాడారు.తండ్రికి తగ్గ తనయుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి, కూడా తండ్రి బాటలో ప్రయాణిస్తూ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో జనరంజక పాలన అందిస్తున్నారని ఆయన అన్నారు.డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి, వర్ధంతిని పురస్కరించుకొని డా.వై.యస్.ఆర్- జక్కంపూడి రామ్మోహన రావు బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న టి. కె. విశ్వేశ్వర రెడ్డి, ఆయన ప్రత్యేకంగా అభినందించారు.