జనం గుండెల్లో వైఎస్సార్‌ రాజశేఖర్ రెడ్డి

TV77తెలుగు రాజశేఖరరెడ్డి 13వ వర్ధంతి నేడు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు,వైఎస్ అభిమానులు,కాంగ్రెస్ నేతలు ఘన నివాళి ఘటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా వైఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.వైఎస్ కుటుంబం ఇడుపులపాయలో వైఎస్ సమాధివద్ద నివాళి ఘటించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,ఆయన చెల్లెలు షర్మిల,కుటుంబ సభ్యులు వైఎస్ సమాధి వద్ద నివాళి ఘటించనున్నారు.జనం గుండెల్లో వైఎస్సార్‌ది చెరగని స్థానం.2009 సెప్టెంబర్ 2న మానసపుత్రిక లాంటి పథకం ‘రచ్చబండ’ద్వారా ప్రజల బాధలు తెలుసుకోవడానికి బయలుదేరారు వైఎస్సార్.13 ఏళ్ల కిందట చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళుతూ సీఎం వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. వైఎస్ హెలికాప్టర్ మిస్ అయ్యి,కొన్ని గంటల పాటు ప్రతిష్టంభన ఏర్పడింది.హెలీకాప్టర్ జాడను కనుక్కోవడానికి తీవ్రంగా శ్రమించారు. చివరకు శ్రీశైలం అడవుల్లోని నల్లకాలువ వద్ద వైఎస్ ప్రయాణించిన హెలీకాప్టర్ కూలిందని నిర్ధారించారు. మరుసటి రోజు వైఎస్ మరణించారనే విషయాన్ని ప్రకటించారు.వైఎస్ మరణం.ఏపీ రాజకీయాలను అనేక మలుపులు తిప్పింది. వైఎస్ మరణం తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు.వైఎస్ తర్వాత రోశయ్య. కిరణ్ కుమార్ రెడ్డిలు సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఆపై రాష్ట్ర విభజన జరిగి ఏపీ,తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.నేటీకి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలు ఇరు రాష్ట్రాల్లో అమలు అవుతున్నాయి.పింఛనుతో ఆకలి తీర్చుకుంటున్న పండుటాకు ప్రతి అన్నం మెతుకులోనూ రాజన్ననే చూసుకుంటుంది. ఫీజు రాయితీతో ఎదిగిన ప్రతి సరస్వతీ పుత్రుడు నీ రుణం తీర్చుకోలేమంటూ చేతులు జోడిస్తాడు. ఆరోగ్యశ్రీతో పునర్జన్మ పొందిన నిరుపేదలైతే ఆ ఆత్మీయ నేతను నిత్యం దేవుడిలా కొలుస్తారు. వైఎస్సార్ పాలనను తలచుకుంటే మచ్చుకు గుర్తుకొచ్చే కొన్ని అంశాలివి.. తనదైన పాలనతో తెలుగు ప్రజల అభిమానం చూరగొన్న నేత వైఎస్ రాజశేఖరరెడ్డి.అలాంటి మహానేత అభిమానులు, పార్టీ కార్యకర్తలను తీరని శకంలో ముంచుతూ 2009 సెప్టెంబర్ 2న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు..