కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో బురిడి పోలీసుల అదుపులో మాయ

TV77తెలుగు ఏలూరు రూరల్
కలెక్టర్‌ కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ ఘరానా మోసగాడు అక్రమాలకు తెరలేపాడు. అంతే కాదు కలెక్టర్‌ సంతకాలనే ఫోర్జరీ చేసి అమాయకులకు నకిలీ నియామకపత్రాలు అందించాడు. చివరకు మోసం బట్టబయలు కావటంతో కటకటాలపాలయ్యాడు. ఏలూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌ వద్ద గురువారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ వివరాలు వెల్లడించారు. చింతలపూడికి చెందిన పసల రత్నాకర్‌ ఇంటర్‌ వరకు చదివి, జల్సాలకు అలవాటు పడ్డాడు. నిరుద్యోగుల అవసరాన్ని అడ్డంపెట్టుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపాడు. ఇతని తండ్రి గతంలో చింతలపూడి తహశీల్దారు వద్ద ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేసేవారు. ఈ నేపథ్యంలో 2014లో ద్వారకాతిరుమల తహశీల్దారు వద్ద డ్రైవర్‌గా చేరాడు. నాలుగేళ్ల పాటు పని చేసి, కారుణ్య నియామకాలు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాలపై అవగాహన పెంచుకున్నాడు. మూడేళ్ల కిందట ఏలూరు అమీనాపేటలో ఇల్లు అద్దెకు తీసుకుని ప్రభుత్వ ఉద్యోగినని స్థానికులను నమ్మించాడు. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, చేకూరి హేమలత (మాదేపల్లి), ఉషా ఆనంద్‌కుమార్‌ (వంగూరు), గండికోట నాగబాబు (ఏలూరు), కొండా రాజేశ్‌ (ఆకివీడు), తానంకి రవిబాబు (చింతలపూడి) తదితరుల నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేశారు. గుట్టు రట్టయింది ఇలా. నిందితుడు పసల రత్నాకర్‌కు అతని తండ్రి రాజు కూడా సహకరించాడు. అప్పటి కలెక్టర్‌ ముత్యాలరాజు పేరుతో ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ నియామకపత్రాలు సృష్టించాడు. బాధితులకు అనుమానం వచ్చి ఇటీవల నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లి ఆరా తీయటంతో నకలీ నియామకపత్రాలని తేలింది. కొందరు ఏలూరు రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రత్నాకర్‌ను ఏలూరు కండ్రికగూడెం సెంటరులో అరెస్టు చేశారు. మరో నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు. రత్నాకర్‌ నుంచి ఆర్డీవో నేమ్‌ ప్లేట్‌తో ఉన్న కారు, బుల్లెట్‌, కలెక్టరేట్‌ నకిలీ సీల్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.