వి లవ్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్

TV77తెలుగు రాజమహేంద్రవరం: ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు.ఆదివారం నాడు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి నందు వి లవ్ యు పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ క్యాంప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ సరైన సమయాల్లో రక్తం లభించక ఎందరో మన కళ్లముందే ప్రాణాలను కోల్పోతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఒకరి ప్రాణం కాపాడగలిగే అరుదైన అవకాశం కేవలం రక్త దానంతో మాత్రమే సాధ్యమవుతుందన్నారు.గత దశాబ్ద కాలంగా జక్కంపూడి రామ్మోహన రావు పౌండేషన్ ద్వారా ఎన్నో రక్తదాన శిబిరాలు నిర్వహించి అవసరమైన వారందరికీ తమ వంతుగా రక్తంసరఫరా చేయడం జరిగిందన్నారు.రక్తం కొరతతో ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు అనే ఉద్దేశ్యంతో దివంగత నేతలైన డా.వై.ఎస్.ఆర్ జక్కంపూడి రామ్మోహన రావు పేర్లుతో బ్లడ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వారు ఎవరైనా సంవత్సరానికి రెండు లేదా మూడు పర్యాయాలు రక్తదానం చేయవచ్చునని,రక్త దానం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయన్నారు.యువతను చైతన్యపరిచి మరింత మంది రక్తదానం చేసే విధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టవలసిన ఆవశ్యకత ఉందన్నారు.క్యాంపులో ర‌క్తాన్ని దానం చేస్తున్న‌వారినంద‌రినీ క‌లిసి వారికి అభినంద‌న‌లు తెలిపారు. వి లవ్ యు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 421 బ్లడ్ క్యాంపులను నిర్వహించడం ఎంతో గొప్ప విషయమని అందుకు కారణం అయిన వి లవ్ యు ఫౌండేషన్ చైర్ పర్సన్ జాంగ్-గిల్ -జా గారికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.వి లవ్ యు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం నిర్వహించడం ఎంతో అభినందనీయమని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో దేశీరెడ్డి బలరామ నాయుడు, ఫౌండేషన్ మేనేజర్ బి.అనిల్ కుమార్, ఎం.రాజ శేఖర్, ఫౌండేషన్ సభ్యులుడి.శ్రీనివాస్ పి.సూరిబాబు,బీ.శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు.