డైలాగులు కొట్టేవాళ్లు కాదు పని చేసే వాళ్లు కావాలి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు

TV77తెలుగు హుజూరాబాద్‌: సెంటిమెంట్‌ డైలాగులు కొట్టేవాళ్లు కాదని, పని చేసే వాళ్లు కావాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పరోక్షంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి విమర్శించారు. దేశంలో భాజపా,కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆడపిల్లల పెళ్లిళ్లకు ఒక్క రూపాయి కూడా సాయం ఇవ్వటం లేదని,రాష్ట్రంలో కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తుంటే. ఆ డబ్బులు పరిగె ఏరుకోవటమేనని, పనికిరానిదని భాజపా నేత ఈటల అంటున్నారని వ్యాఖ్యానించారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో శనివారం మెప్మా ఆధ్వర్యంలో వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ. ‘‘ఏడేళ్లు మంత్రి పదవిలో ఉండి నియోజకవర్గంలో ఒక్క రెండు పడకల గది ఇల్లు కట్టి గృహప్రవేశం చేయించలేదు. ఒక్క మహిళా సంఘ భవనం కట్టించలేదు. ఇవి అడిగినందుకు నన్ను లేనిపోని మాటలు అంటున్నారు’’ అని వాపోయారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ బండ శ్రీనివాస్‌, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, తెరాస నేత పాడి కౌశిక్‌రెడ్డి పాల్గొన్నారు._