పాపులారిటీ కోసం అమ్మాయిని కారుపైన కట్టేసి
abuztua 05, 2021
tv77 telugu : రష్యాకు చెందిన ఓ వ్యక్తి మరో తింగరి పనిచేశాడు. ఇన్ స్టా గ్రామ్ లో పాపులర్ అయిన సెర్గీ కోసెంకో అనే వ్యక్తి మరింత పాపులారిటీ కోసం చేసిన పని చేస్తూ.. ఔరా! అనాల్సిందే. ఇతగాడికి ఏకంగా 50 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారిని సంతృప్తి పరిచేందుకు.. సూపర్ కేక తురుము అనిపించుకునేందుకు విపరీతాలన్నీ చేస్తుంటాడు.
లేటెస్ట్ మరో కొత్త పని చేశాడు. అదేమంటే.. తన కారును బయటకు తీశాడు. రయ్య్ మంటూ.. రోడ్లమీద షికారు చేస్తూ జాలీగా రైడ్ కు వెళ్లాడు. తిరిగి మళ్లీ ఇంటికి చేరాడు. ఇందులో వింత ఏముందని అంటున్నారు. వింత అందులో లేదు.. ఆ కారు పైన ఉంది! అవును.. ఆ కారుమీదనే అందరి దృష్టి పడేలా చూసుకున్నాడు. ఇంతకీ ఆ కారు పైన ఏముందంటే..
తన గర్ల్ ఫ్రెండ్ ను కారు పైన పడుకోబెట్టాడు. తెలుగు సినిమాల్లో విలన్ ను కారు పైన పడుకోబెట్టి మొత్తం తాళ్లతో బంధిస్తారు కదా.. అచ్చం అదేవిధంగా చేశాడు. తన గర్ల్ ఫ్రెండ్ ను బోర్లా పడుకోబెట్టి.. కాళ్లు నడుము భాగంలో తాళ్లతో కట్టేశాడు. మూతికి ప్లాస్టర్ వేశాడు. మొత్తానికి ఒక కిడ్నాప్ కలరింగ్ ఇచ్చాడు. ఇలా ఊరు మొత్తం తిప్పుకొచ్చాడు. ఇది చూసినవారంతా.. ''ఇదేందయ్యా.. ఇదీ? మేము యాడా చూడ్లే'' అని ముక్కుమీద వేలేసుకున్నారు.
ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసి ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ఇంకేముందీ? కాసేపట్లోనే వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. నెటిజన్లు మాత్రమే కాదు కదా.. పోలీసులు కూడా చూస్తారు. చూసేశారు కూడా. ఇలంటి వెధవ పనిచేసినందుకు భారీగా 'టోలు' వలిచారు. అంటే.. జరిమానా విధించారన్నమాట. ఇక సోషల్ మీడియాలో.. ఇదేం పైత్యంరా బాబూ.. అని కామెంట్లు అందుకున్నారు. అయినా.. ఈ తిట్లు వాళ్లను మారుస్తాయంటారా?