అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది
abuztua 26, 2021
కృష్ణా జిల్లా నందిగామ మండలం నూతన జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి యానం వెళ్తున్న కావేరి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 38 మంది ప్రయాణికులతో బయలు దేరింది. ఈ క్రమంలోనే బస్సు అర్థరాత్రి సమయానికి నందిగామ మండలం అనాసాగరం చేరుకుంది. ఈ సమయంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకున్నాడు. బస్సు అతివేగంలో ఉండడంతో బస్సును కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో ముందు ఇనుప చువ్వల లోడ్‌తో వెళుతోన్న లారీని బస్సు వెనక నుంచి ఢీకొట్టింది.
అయితే అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు సాధారణ గాయాలు కాగా డ్రైవర్‌కి తీవ్ర గాయాలాయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని 108కి సమాచారం అందించారు. దీంతో క్షతగాత్రులను వెంటనే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 38 మంది ఉన్నారు. ఒకవేళ ఏమాత్రం అదుపు తప్పిన భారీగా నష్టం జరిగేదని ప్రయాణికులు చెబుతున్నారు. బస్సులో ఉన్న మిగతా 34 మంది వారి గమ్యాలకు సురక్షితంగా చేరుకున్నారని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్య, అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు.