బంగారం చోరీ ఘటనలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కక్కుర్తి

ముంబయి నుంచి వచ్చిన బస్సులో 2కిలోల బంగారం చోరీకి గురైన ఘటనలో ఇంటి దొంగల హస్తం ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముంబైకి చెందిన రనూజా జువెలర్స్‌ దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న జువెలరీ దుకాణాలకు ఆభరణాలను సరఫరా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే నగరానికి చెందిన నగల వ్యాపారి శ్రావణ్‌ గెహ్లాట్‌ వారి దగ్గర చేయించిన బంగారు 2.12కిలోల ఆభరణాలతో ఈనెల 23న సాయంత్రం ముంబయిలో హైదరాబాద్ వెళ్లే బస్సెక్కాడు.మరుసటి రోజు ఉదయం గమ్యస్థానం దిగేసరికి ఆభరణాల బ్యాగ్ కనిపించలేదు. దీంతో ఆయన సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును పంజాగుట్ట పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పంజాగుట్ట డీఐ నాగయ్య ఆధ్వర్యంలో నాలుగు బృందాలు మొదట నగరంలోని పలు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ముంబయి వెళ్లి గెహ్లాట్‌ తిరిగిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను ముంబయి, రాజస్థాన్‌ ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించి కొంత బంగారం రికవరీ చేశారు. అయితే ఫిర్యాదుదారుడు చెప్పిన విషయాలకు పొంతన లేకపోవడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా అసలు నిజం బయటపడింది. ఇన్సూరెన్స్‌ ద్వారా నగదు కాజేయాలనే దురుద్దేశంతో ఈ నాటకానికి తెర తీసినట్లు వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సోమవారం పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది....