కిటికీల్లోంచి ఆమెపై నిఘా

TV 77 TELUGU: 24 ఏళ్ల ఆ యువతి పేరు మానస.. మెడికల్ కాలేజీలో చదువుకుంటోంది.. ఆమెపైన నిఘా వేసిన ఓ కుర్రాడు ఆమె రూమ్‌కు సమీపంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు.. ఆమెను నిరంతరం పరిశీలించేవాడు.. శుక్రవారం మధ్యాహ్నం హఠాత్తుగా ఆమె రూమ్‌కు వెళ్లి తుపాకీతో ఆమెను కాల్చి చంపేశాడు.. అనంతరం తనను తాను కాల్చుకుని చనిపోయాడు.. కేరళలోని కొత్తమంగళంలో ఈ ఘటన జరిగింది. కేరళ రాష్ట్రంలో కలకలం రేకెత్తిస్తున్న ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాఫ్తు చేపట్టగా ఆ యువకుడి పేరు రఖిల్ రఘుథామన్‌గా తెలిసింది. ఇంటిరీయర్ డిజైనర్‌గా పనిచేస్తున్న రఖిల్.. గతంలో మానసతో ప్రేమాయణం సాగించాడు. అయితే రెండు నెలల క్రితం రఖిల్‌కు మానస బ్రేకప్ చెప్పేసింది. అయినా అతను మానసను వెంబడిస్తుండడంతో ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పోలీసుల రఖిల్‌ను స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా రఖిల్.. మానసను వెంబడించడం మానలేదు. మానస తనతో మాట్లాడేందుకు కూడా అంగీకరించకపోవడంతో ఆమెను హత్య చేయాలని రఖిల్ పథకం వేశాడు. మానస తన ఊరు నుంచి కొత్త మంగళం వచ్చి గాంధీ డెంటల్ అండ్ మెడికల్ సైన్సెస్ కాలేజీలో హౌస్ సర్జెన్సీ చేస్తోంది. ఆ కాలేజ్‌కు సమీపంలోనే ఒక రూమ్ తీసుకుని తన స్నేహితులతో కలిసి ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న రఖిల్‌ అక్కడకు సమీపంలో ఉన్న ఓ లాడ్జిలో గది తీసుకున్నాడు. నాలుగు రోజుల పాటు అక్కడ ఉండి రహస్యంగా మానసపై నిఘా పెట్టాడు. గత శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మానస రూమ్‌ లోపలికి వెళ్లి తలుపు గడియపెట్టాడు. తనతో పాటు తెచ్చుకున్న తుపాకీ తీసి మానసపై కాల్పులు జరిపాడు. వెంటనే తనను తాను కాల్చుకున్నాడు. కాల్పుల శబ్దం విని పైకి వచ్చిన వారు వీరిని హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకుని కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. మానస తల్లిదండ్రులను, రఖిల్ స్నేహితులను ప్రశ్నిస్తున్నారు. తుపాకీ కోసం రఖిల్ స్వయంగా బీహార్ కూడా వెళ్లాడని పోలీసుల దర్యాఫ్తులో తేలింది.