డిస్నీ మూవీ ఎన్నారై బ్యూటీ
abuztua 25, 2021
ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు ఆంగ్ లీ తెరకెక్కించిన `లైఫ్ ఆఫ్ పై` చిత్రం ఆస్కార్ లతో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. అనుకోని ప్రమాదంలో ఓడ మునిగిపోయాక అందులోంచి బయటపడిన పై పెద్ద పులితో ఒక బోట్ లో జీవించాల్సి వస్తుంది. ఆ క్రమంలో తీరం చేరే వరకూ పెద్ద పులితో జీవితం ఎలా సాగింది? అన్నదే ఈ సినిమా కథాంశం. అయితే పై సర్కస్ కంపెనీ యజమాని కొడుకుగా భూమిపై జీవించిన కాలంలో ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయి భారతీయ వనిత. క్లాసికల్ నృత్యంతో మైమరిపిస్తూ కళ్లతోనే కోటి భావాలు పలికించిన ఈ అమ్మాయి పేరు స్రవంతి సాయినాథ్. ఇప్పుడు డిస్నీ సినిమాతో హాలీవుడ్ లో అడుగుపెడుతున్న 16 ఏళ్ల ఈ తెలుగమ్మాయి అవంతిక తన సోదరినే తలపిస్తోంది. ఈ బ్యూటీ అమెరికాలో నివశిస్తుంది. అమెరికన్ OTT రంగంలో ప్రస్తుతం తెలుగమ్మాయి అవంతిక హవా కొనసాగుతోంది. తాజాగా డిస్నీ కొత్త చిత్రం స్పిన్ లో నటిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
హాలీవుడ్ లోకి వెళ్లే ముందు అవంతిక తెలుగు సినిమాల్లో నటించింది. మహేష్ బాబు `బ్రహ్మోత్సవం`.. చంద్రశేఖర్ యేలేటి `మనమంతా`.. నాగ చైతన్య `ప్రేమమ్` లో కనిపించింది. ఇటీవల నెట్ ఫ్లిక్స్ తమిళ చిత్రం `భూమిక`లో ఆటిజం అమ్మాయి పాత్రలో నటించింది. ఆగస్టు 13న డిస్నీ ప్లస్ లో స్పిన్ మూవీని ప్రీమియర్ వేశారు. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భారతదేశంలో అందుబాటులో ఉంది. భారతీయ-అమెరికన్ కమ్యూనిటీకి చెందిన ఔత్సాహిక DJ రియా పాత్రలో అవంతిక నటించింది. స్పిన్ కి ప్రపంచవ్యాప్తంగా సానుకూల సమీక్షలు వచ్చాయి. అవంతిక నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి.
అవంతిక కూచిపూడి నృత్యకారిణి. ATA స్టార్ డ్యాన్సర్ 2012 విజేత. డాన్స్ ఇండియా డాన్స్ లిటిల్ మాస్టర్స్ 2014 లో రన్నరప్ గా నిలిచింది. అవంతిక చిన్న వయసులో హాలీవుడ్ లో పెద్ద స్టార్ గా ఎదగడం తెలుగు వారందరికీ గర్వకారణం. హాలీవుడ్ లో అవంతిక ఎంతో ఉత్సాహంగా నటిస్తోంది. స్రవంతి సాయినాథ్ .. అవంతిక తరహాలోనే చాలా మంది తెలుగమ్మాయిలు హాలీవుడ్ లో స్టార్లుగా కెరీర్ ని సాగిస్తున్నారు. అయితే ఓటీటీ ప్రపంచం వల్లనే వీరంతా తెలుగు వారికి తిరిగి పరిచయమవుతుండడం ఆశ్చర్యకరం.