వివేకా హత్యకేసు అనుమానితుడు సునీల్‌‌కు రిమాండ్

tv 77 telugu : కడప: వైఎస్ వివేకా హత్యకేసులో కీలక అనుమానితుడు సునీల్‌ను సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపర్చారు. సునీల్‌‌పై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనంతరం జడ్జి ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ మేరకు విచారించిన జడ్జి.. సునీల్‌కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో సునీల్‌ను సీబీఐ అధికారులు కడప సెంట్రల్ జైలుకు తరలించారు. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు, పులివెందులకు చెందిన సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు గోవాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సీబీఐ అధికారికంగా ధృవీకరించింది. నిన్న సాయంత్రం గోవాలో అరెస్టు చేసిన అధికారులు గోవా స్థానిక కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్‌ రిమాండ్‌లోకి తీసుకున్నారు. గోవా నుంచి కడపకు తీసుకువచ్చి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న సునీల్‌‌ను ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు విచారించారు. తనను సీబీఐ వేధిస్తోందని, థర్డ్ డిగ్రీతో టార్చర్ పెడుతోందంటూ సునీల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. అనంతరం ఆయన పులివెందులలోని తన ఇంటికి తాళాలు వేసి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో సునీల్ గోవాలో తలదాచుకున్నట్లు తెలుసుకున్న సీబీఐ అధికారులు గోవాకు వెళ్లి అరెస్టు చేశారు. గోవా స్థానిక కోర్టులో హాజరు పర్చిన అధికారులు ట్రాన్సిట్‌ రిమాండ్‌లోకి తీసుకున్నారు