సెన్సెక్స్‌ @ 54,000 సరికొత్త రికార్డు ముగింపు

TV 77 TELUGU : బుల్‌ పరుగు ఆగలేదు. సూచీల జోరు బుధవారం కూడా కొనసాగింది. సెన్సెక్స్‌, నిఫ్టీలు తాజా జీవన కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. కంపెనీల మెరుగైన ఆర్థిక ఫలితాలకు తోడు అంతర్జాతీయ సానుకూల పరిమాణాలతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు. సెన్సెక్స్‌ తొలిసారిగా 54,000 పాయింట్ల మార్కును అధిగమించడమే కాకుండా, ఈ స్థాయి కంటే పైనే ముగియడం విశేషం. నిఫ్టీ ఇంట్రాడేలో 16,290.20 పాయింట్ల వద్ద జీవన కాల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. అంతర్జాతీయ సూచీలకొస్తే ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్‌, సియోల్‌ లాభపడగా, టోక్యో సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లు సానుకూలంగా కదలాడాయి. సెన్సెక్స్‌ ఉదయం 54,071.22 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది. కొనుగోళ్ల మద్దతుతో 54,465.91 పాయింట్ల వద్ద గరిష్ఠానికి చేరింది. ఒక దశలో 54,034.31 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసినా చివరకు 546.41 పాయింట్ల లాభంతో 54,369.77 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 128.05 పాయింట్లు లాభపడి 16,258.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,290.20-16,176.15 పాయింట్ల మధ్య కదలాడింది.