హైకోర్టు బిగ్ షాక్.. 4 వారాలే గడువు, వాటిని తొలగించాల్సిందే..!
abuztua 31, 2021
TV77తెలుగు
అమరావతి..
జగన్ ప్రభుత్వానికి మరోసారి ఊహించని షాకిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకేలు), సచివాలయాలు నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల స్థలాల్లో ఆర్‌బీకేలు, సచివాలయాలు నిర్మించడంపై హైకోర్టులో విచారణ జరగగా, మొత్తం ఏడుగురు ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి.చినవీరభద్రుడు, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలారావు, గతంలో పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన విజయకుమార్, ఎంఎం నాయక్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,160 చోట్ల ఆర్‌బీకేలు, సచివాలయాలు నిర్మించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే 450 నిర్మాణాలను మరో చోటకు తరలించినట్లు అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే, మిగిలి నిర్మాణాల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. మిగిలిన నిర్మాణాలను కూడా 4 వారాల్లో తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేసింది.