2032 ఒలింపిక్స్ వరకు రెజ్లింగ్‌ను దత్తత తీసుకున్న యూపీ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2032 ఒలింపిక్స్ వరకు రెజ్లింగ్‌ను దత్తత తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మొత్తం రూ. 170 కోట్ల వరకు ఖర్చు చేయనుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ తెలిపారు. హాకీకి ఒడిశా ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలతో స్ఫూర్తి పొంది యూపీ ప్రభుత్వాన్ని కూడా ఇలాంటి సాయమే కోరినట్టు చెప్పారు.ఒడిశా చాలా చిన్న రాష్ట్రమని అయినప్పటికీ చాలా గొప్ప మనసుతో హాకీకి మద్దతు ఇచ్చిందని బ్రిజ్‌భూషణ్ పేర్కొన్నారు. కాబట్టి ఇదే పని యూపీ ఎందుకు చేయలేదని అనుకున్నామని, అంత పెద్ద రాష్ట్రం రెజ్లింగ్‌కు అండగా నిలవలేదా? అని భావించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి అడిగితే వెంటనే అంగీకరించారని తెలిపారు. ‘‘మా ప్రతిపాదనలో 2024 ఒలింపిక్స్ వరకు ప్రతి సంవత్సరం ఏడాదికి రూ. 10 కోట్లు (మొత్తం రూ. 30 కోట్లు), ఆ తర్వాత 2028 ఒలింపిక్స్ కోసం ఏడాదికి రూ. 15 కోట్లు (రూ.60 కోట్లు), 2032లో సంవత్సరానికి రూ. 20 కోట్లు (రూ. 80 కోట్లు) అడిగాం’’ అని ఆయన తెలిపారు.ఇలా జరిగితే స్పాన్సర్‌షిప్‌లు కేవలం దేశంలోని అత్యుత్తమ రెజ్లర్లకు మాత్రమే పరిమితం కావని బ్రిజ్‌భూషణ్ అన్నారు. క్యాడెట్ స్థాయి రెజ్లర్‌లు కూడా స్పాన్సర్‌షిప్ పొందుతారని, తాము జాతీయ ఛాంపియన్‌లకు కూడా ప్రైజ్ మనీని ఇవ్వగలుగుతామని వివరించారు.